మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిమజ్జనంలో విషాదం

0
16

గణేశ్ విగ్రహాల నిమజ్జనం… మహారాష్ట్రలో 20 మంది మృతి

హ్యూమన్ రైట్స్ న్యూస్/ ముంబై : మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా 20 మంది చనిపోయారని పోలీసులు శనివారం తెలిపారు. వీరిలో 14 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వార్ధా జిల్లా సావంగిలో ముగ్గురు నీట మునిగి చనిపోగా, దేవ్లీలో ఇదే విధంగా మరొకరు మృతి చెందారు. యావత్మాల్ జిల్లాలో విగ్రహం నిమజ్జనం చేస్తుండగా చెరువులో మునిగి ఇద్దరు చనిపోయారు. అహ్మద్ నగర్ జిల్లాలో సూపా, బెల్వండి ప్రాంతాల్లో ఇద్దరు, ఉత్తర మహారాష్ట్ర జలగావ్‌లో మరో ఇద్దరు మృతి చెందారు. పుణె జిల్లా ఘొడెగావ్, యావత్ ప్రాంతాల్లో ధూలే జిల్లాలోను, సతారా జిల్లా లోనికాండ్, సోలాపూర్ నగరం లోను ఒక్కొక్కరు వంతున మృతి చెందారు. నాగపూర్ నగరం సక్కర్‌దార ఏరియాలో గణేశ్ విగ్రహం నిమజ్జనం సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. థానేలో కొల్బాడ్ ఏరియాలో భారీ వర్షాలకు శుక్రవారం రాత్రి గణేశ్ పెండాల్‌పై చెట్టుకూలి, 55 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. రాయిగడ్ జిల్లా పన్వేల్‌లో శుక్రవారం సాయంత్రం ఊరేగింపు సందర్భంగా కరెంట్ షాక్ తగిలి 11 మంది గాయపడ్డారు.