ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త బిబి లాల్ కన్నుమూత

0
16

హ్యూమన్ రైట్స్ న్యూస్/న్యూఢిల్లీ: ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత బిబి లాల్ శనివారం తన 101వ ఏట కన్నుమూశారు. గతంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్‌ఐ) డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన బిబి లాల్ అయోధ్యలో ప్రస్తుతం రామ మందిరం నిర్మాణమవుతున్న ప్రదేశంలో ఆలయానికి సంబంధించిన స్తంభాలను కనుగొన్నారు. ఎఎస్‌ఐకి అత్యంత పిన్నవయస్కుడైన డైరెక్టర్ జనరల్‌గా 1968 నుంచి 1972 మధ్య కాలంలో లాల్ పనిచేశారని అధికారులు తెలిపారు. బిబి లాల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మన ఘనమైన గతాన్ని ప్రస్తుత సమాజానికి అనుసంధానించడంలో గొప్ప పాత్ర పోషించిన మేధావిగా లాల్‌ను ప్రధాని కీర్తించారు. మన దేశ సంస్కృతికి, పురావస్తు పరిశోధనకు ఆయన అందచేసిన సేవలు అపూర్వమని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కూడా బిబి లాల్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. లాల్ మృతితో దేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.