నేడు శాసనసభ, మండలి సమావేశాలు తిరిగి ప్రారంభం

0
29

హైదరాబాద్‌: శాసనసభలో కీలకమైన ఏడు బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు కేంద్ర విద్యుత్తు బిల్లు పర్యవసానాలపై ప్రభుత్వం చర్చించనుంది. ఈ నెల ఆరో తేదీన వాయిదా పడ్డ శాసనసభ, మండలి సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. మంగళవారం కూడా నిర్వహించనున్నారు. కేంద్ర విద్యుత్తు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తోంది. దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఇప్పటికే వెల్లడించింది. దీనిపై ఉభయసభల్లో చర్చించి, కేంద్రం వైఖరిని ఎండగట్టాలని భావిస్తోంది. చర్చలో సీఎం కేసీఆర్‌ కూడా పాల్గొని ప్రసంగించనున్నారని తెలుస్తోంది.

మరోవైపు శాసనసభ సమావేశాల మొదటి రోజున సభాపతి శ్రీనివాస్‌రెడ్డిపై భాజపా ఎమ్మెల్యే ఈటల చేసిన విమర్శలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రస్తావించి ఆయనపై చర్యలను కోరనున్నట్లు సమాచారం. సమావేశాల ప్రారంభంలో బీఏసీ తీసుకున్న నిర్ణయాలపై నివేదికను ఉభయసభల్లో ప్రవేశపెడతారు. అనంతరం శాసనసభలో మంత్రులు 7బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ జీఎస్టీ సవరణ, హైదరాబాద్‌లోని ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత లీజు రద్దు, క్రమబద్ధీకరణ సవరణ; పురపాలక చట్టాల సవరణ, బోధనాసుపత్రుల వైద్యనిపుణుల వయోపరిమితి పెంపు, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయాల ఉమ్మడి పరీక్ష మండలి, రాష్ట్ర మోటారు వాహనాల పన్ను సవరణ బిల్లులు ఇందులో ఉన్నాయి.