దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ….ప్రేమ కేసులకు పోక్సో చట్టం

0
26

HUMAN RIGHTS TODAY/DELHI: లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే పోక్సో చట్టం యువతీ యువకుల మధ్య పరస్పరాంగీకారంతో నెలకొనే ప్రేమ బంధాన్ని శిక్షించడానికి ఉద్దేశించినది కాదనీ, బాలలను లైంగిక అత్యాచారాల నుంచి కాపాడటమే దాని పరమార్థమని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

17 ఏళ్ల బాలికను పెళ్లాడినందుకు పోక్సో చట్టం కింద అరెస్టయిన ఒక యువకుడికి బెయిలు ఇచ్చేటప్పుడు కోర్టు ఈ వివరణ ఇచ్చింది. వీరిద్దరి మధ్య అనురాగం ఏర్పడిందని, బాలిక స్వయంగా యువకుడి ఇంటికి వెళ్లి తనను పెళ్లాడమని కోరడమే దీనికి నిదర్శనమని గుర్తుచేసింది. బాలిక మైనర్‌ కాబట్టి ఆమె సమ్మతికి చట్టబద్ధత లేదనే మాట నిజమే కానీ, తామిద్దరం ప్రేమించుకుంటున్నామని బాలిక స్వయంగా ప్రకటించడాన్ని పరిగణనలోకి తీసుకుని నిందితుడికి బెయిలు మంజూరు చేస్తున్నామని హైకోర్టు ప్రకటించింది. బాలిక ప్రకటనను నిర్లక్ష్యం చేసి, యువకుడిని జైల్లో పెట్టడం న్యాయాన్ని వక్రీకరించడమవుతుందని జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌ స్పష్టీకరించారు. అయితే, అత్యాచారాలు జరిగినప్పుడు పోక్సో చట్టం వర్తిస్తుందని తేల్చిచెప్పారు. ప్రస్తుత కేసులో నిందితుడి నుంచి రూ.పది వేలకు వ్యక్తిగత హామీ పత్రం, అంతే మొత్తానికి పూచీకత్తు తీసుకుని బెయిలు మంజూరు చేయాలని తీర్పునిచ్చారు.